జాతీయం

Bhabanipur bye-election | నేడు నామినేషన్‌ వేయనున్న సీఎం

పశ్చిమబెంగాల్‌లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. బీబేపీ నేత సువేందు అధికారిని ఓడించడానికి నందిగ్రామ్‌ నుంచి పోటీచేశారు. అయితే గట్టిపోటీనిచ్చిన ఆమె కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఆమె ఏ సభకూ ఎన్నిక కాకుండానే మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు.

కాగా, ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నికకావాల్సిన ఉన్నందున.. భవానీపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవ‌సాయ మంత్రి సోబ‌న్‌దేవ్ చ‌టోపాధ్యాయ్.. మ‌మ‌తా బెన‌ర్జి కోసం త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌తోపాటు మరో రెండు స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గత శనివారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనుంది. వచ్చే నెల 3న ఓట్లను లెక్కిస్తారు. కాగా, మమతా బెనర్జీపై పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక ప్రధాన ప్రతిపక్షం తన అభ్యర్థిని బరిలో నిలపనుంది. ఈ సారికూడా మమత ఓటమి ఖాయమని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.