ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని అంతచేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ.. అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా (Al Qaeda) దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ తమ ఆధీనంలోకి తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రానున్న కాలంలో అక్కడ అల్ ఖాయిదా తిరిగి వేళ్లూనుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న 1,2 సంవత్సరాల్లో అమెరికాపై అల్ ఖాయిదా మరోసారి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్‌ను ఉటంకిస్తూ నివేదికలో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ ప్రసంగించారు. తిరిగి జీవం పోసుకుని అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని రకాల వనరులు, అవకాశాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖాయిదా మార్గాలను అన్వేషిస్తున్నదని చెప్పారు.
కాగా, ఒకటి, రెండేండ్ల కాలవ్యవధిని సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కోహెన్ అంగీకరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖాయిదా తిరిగి వస్తున్న విషయాలను నిఘా సంస్థలు ఇప్పటికే గమనించాయని చెప్పారు. అయితే, రెండు దశాబ్దాల అమెరికన్ దళాల ఉపసంహరణ అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ముప్పు జాబితాలో ఉన్నదని ఎన్‌ఐఏ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనేక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.