వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో తమ పార్టీ అభ్యర్ధులను విజయతీరాలకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
కింగ్ మేకర్ పాత్ర వంటి పదాలు అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వార్తా చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ కాషాయ పార్టీ ఓటమే తమ తొలి ప్రాధాన్యత అని విస్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరమే పార్టీలతో కూటమి ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యూపీలో 19 శాతం జనాభా ఉన్న ముస్లింలకు ప్రధాన రాజకీయ పార్టీల్లో తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.