ఇండియన్ యూత్ కాంగ్రెస్ నిర్ణయం
దేశంలో ఏటికేడు పెరిగిపోతన్న నిరుద్యోగితకు నిరసనగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజును జాతీయ నిరుద్యోగదినంగా జరుపుకోవాలని వినూత్న నిర్ణయం తీసుకున్నది. జాతీయ నిరుద్యోగ దినాన్ని పురస్కరించుకుని ఆ రోజు దేశవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ యూత్ కాంగ్రెస్ తెలిపింది.
దేశంలోని యువత ఉద్యోగాలు దొరకక రోడ్లపై తిరుగుతున్నది. ప్రధాని మోదీ దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చారు. కానీ, ఇప్పుడు కేంద్ర సర్కారు నిరుద్యోగం ఊసే ఎత్తడం లేదు అని ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ విమర్శించారు. ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఒక్క ఏడాది వ్యవధిలోనే దేశంలో నిరుద్యోగిత 2.4 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగిందని శ్రీనివాస్ తెలిపారు.