బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ( Sonu Sood ) ఇంట్లోనూ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి అతని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. గురువారం ఉదయాన్నే ఇంటికి చేరుకున్నారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ సూద్‌కు ఉన్న ప్రాపర్టీ డీల్‌పై పన్ను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం ఆరు చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లక్నో రియల్ ఎస్టేట్ కంపనీతో జరిపిన డీల్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ డీల్‌లో పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సర్వే జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆపరేషన్‌ను సర్వేగా వాళ్లు పిలుస్తున్నారు. అయితే రాజకీయ కక్షతోనే సోనూ సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొవిడ్ సందర్భంగా చేసిన దాతృత్వ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా సోనూ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. అయితే అతడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి, దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సోనూపై ఇలా ఐటీ దాడుల జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.