మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వచ్చారు. ప్రత్యేక ఆర్మీ హెలీకాప్టర్‌లో వచ్చిన కోవింద్‌కు హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో వచ్చిన కోవింద్.. సిమ్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సిమ్లాను నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ మూడు రోజులు విమానాలతోపాటు డ్రోన్‌ల వాడకంపై నిషేధం విధించారు. 1500 మందికి పైగా పోలీసు, సీఐడీ, ఆర్మీ సిబ్బందిని మోహరించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు అతడి కుటుంబంలోని 20 మంది సభ్యులు సిమ్లా పర్యటనకు వచ్చారు. వీరి వెంట 23 మంది సిబ్బంది కూడా ఉన్నారు. కోవింద్ పర్యటన నేపథ్యంలో భద్రత కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రదేశాల్లో జామర్ వాహనాలను మోహరించారు. ప్రతి 100 మీటర్ల దూరంలో ఒక పోలీసు గార్డును పెట్టారు. రాష్ట్రపతి సెప్టెంబర్ 16 రోజంతా విశ్రాంతి తీసుకుంటారు. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభకు చేరుకుని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన గౌరవార్ధం గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు యారోస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. 19 న ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్తారు.