అంతర్జాతీయం

ప్రిన్స్ ఫిలిప్ వీలునామాకు సీల్‌.. 90 ఏళ్ల త‌ర్వాతే ఓపెన్‌

 బ్రిటీష్ రాణి ఎలిజ‌బెత్ భ‌ర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవ‌ల మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు చెందిన వీలునామాను మ‌రో 90 ఏళ్ల పాటు ర‌హ‌స్యంగా ఉంచాలంటూ గురువారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్వీన్ ఎలిజ‌బెత్ హుందాత‌నానికి సూచ‌కంగా ఆ వీలునామాను తెర‌వ‌రాదు అని హైకోర్టు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 99 ఏళ్ల వ‌య‌సులో ప్రిన్స్ ఫిలిప్ తుది శ్వాస విడిచిన విష‌యం తెలిసిందే. రాచ‌రిక కుటుంబంలో ఎవ‌రైనా సీనియ‌ర్ స‌భ్యులు మ‌ర‌ణిస్తే, వారికి చెందిన వీలునామాపై హైకోర్టులో ఉన్న ఫ్యామిలీ డివిజ‌న్ అధ్య‌క్షుడు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని శ‌తాబ్ధాల నుంచి ఈ ఆచారం కొన‌సాగుతున్న‌ది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ డివిజ‌న్ కోర్టు అధ్య‌క్షుడిగా ఉన్న స‌ర్ ఆండ్రూ మెక్ ఫార్లేన్ .. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాపై తీర్పును ప్ర‌క‌టించారు. ఫిలిప్ వీలునామాను సీలు చేసి, 90 ఏళ్లు త‌ర్వాత దాన్ని తెర‌వాలంటూ మెక్‌ఫార్లేన్ త‌న తీర్పులో వెల్ల‌డించారు. ప్రిన్స్ ఫిలిప్ త‌న వీలునామాలో ఏం రాశారో ఎవ‌రికీ తెలియ‌ద‌ని జ‌డ్జి తెలిపారు.