ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహానగరంలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ యార్డ్‌లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు యార్డ్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మాటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, ఇవాళ తెల్లవారుజామున ముంబైలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్ప కూలింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌లోని ఓ భాగం ఉదయం 4.40 గంటల సమయంలో కుప్ప కూలింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు