భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీటీడీకి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను దెబ్బతీస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యాపార ధోరణితోపాటు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారని అసహనం వ్యక్తం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ఎన్నడూ లేని విధంగా 81 మందితో కూడిన జంబో బోర్డును ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. అట్లాంటి పుణ్య క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం తగదని ఆవేదన వ్యక్తం చేవారు. టీటీడీ బోర్డును భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటు చేయాల్సింది పోయి పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్థులు, కళంకితులకు చోటు కల్పించారని ఆరోపించారు. దీనిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నదని జగన్‌కు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో ఎవరి హయాంలో కూడా ఇంత మందితో కూడిన జంబో బోర్డును ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. ఇటువంటి బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ సంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని సూచించారు.