జాతీయం

చినుకులతో కరెంట్‌!.. ఐఐటీ-ఢిల్లీ పరిశోధకుల వినూత్న ఆవిష్కరణ

  • ‘ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జనరేటర్‌’తో సాధ్యమే
  • ‘ట్రైబోఎలక్ట్రిక్‌’ సూత్రంతో పనిచేయనున్న డివైజ్‌

వాన చినుకుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే వినూత్న సాధనాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘లిక్విడ్‌-సాలిడ్‌ ఇంటర్‌ఫేజ్‌ ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జనరేటర్‌’ పేరిట పిలుస్తున్న ఈ డివైజ్‌ సాయంతో నీటి బిందువులు, వాన చినుకులు, నదీ ప్రవాహాలు, సముద్రపు కెరటాల నుంచి తక్కువ మోతాదులో (మిల్లీవాట్లు) విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ప్రొఫెసర్‌ నీరజ్‌ ఖరే తెలిపారు. దీనికోసం ‘ట్రైబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌’ సాంకేతికతను వినియోగించినట్టు పేర్కొన్నారు. డివైజ్‌లోని నానో కాంపోజిషన్‌ పాలిమర్స్‌, కాంటాక్ట్‌ ఎలక్ట్రోడ్లు విద్యుత్తు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయని, డివైజ్‌ సాంకేతికతపై పేటెంట్‌ హక్కుల కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు.

వేటిని చార్జ్‌ చేసుకోవచ్చు?
‘లిక్విడ్‌-సాలిడ్‌ ఇంటర్‌ఫేజ్‌ ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జనరేటర్‌’ సాయంతో వాచీలు, డిజిటల్‌ థర్మోమీటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిటర్లు, హెల్త్‌కేర్‌ సెన్సర్లు, పెడోమీటర్లను చార్జ్‌ చేసుకోవచ్చు.

ఏమిటీ ‘ట్రైబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌’?
రెండు దుప్పట్లను రాపిడికి గురిచేస్తే నిప్పురవ్వలు వచ్చినట్టే, రెండు భిన్నమైన పదార్థాలను రాపిడికి గురిచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీన్ని స్థూలంగా ‘ట్రైబోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌’ అంటారు. ఒక పదార్థం.. మరో పదార్థానికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య ఘర్షణ ఏర్పడి ఒక మెటీరియల్‌ నుంచి మరో మెటీరియల్‌కు ఎలక్ట్రాన్లు బట్వాడా అవుతాయి. అప్పుడు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక మెటీరియల్‌లో ఉన్న ట్రైబో పాజిటివ్‌ ఎలక్ట్రాన్‌, మరో మెటీరియల్‌లో ఉన్న ట్రైబో నెగిటివ్‌ అయాన్‌తో కలసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రెండు భిన్న పదార్థాలను ఘర్షణకు గురిచేస్తే ఎలక్ట్రిక్‌ ఫీల్డ్‌ ఏర్పడుతుందన్నదే ‘ట్రైబోఎలక్ట్రిక్‌’ సూత్రం.