యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాలను ఉద్దేశిస్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను.. సంప్రదింపులు, సహకారంతో పరిష్కరించుకోవాలన్నారు. ఘర్షణాత్మక వాతావరణం మంచిది కాదు అని ఆయన ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశిస్తూ తెలిపారు. శాంతి, అభివృద్ధి, సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం లాంటి అంశాలపై ప్రపంచం దృష్టి పెట్టాలని, కానీ చిన్నపాటి సర్కిళ్లను గీసి వాటిలో ఉండడాన్ని మానుకోవాలన్నారు. సమానత్వం, పరస్పర గౌరవం ఉంటే, రెండు దేశాల మధ్య గొడవలే ఉండవన్నారు. ఒక దేశం అభివృద్ధి వల్ల మరో దేశం విఫలం అయినట్లు కాదు అని జిన్‌పింగ్ అన్నారు. చైనాతో కొత్తగా ప్రచ్ఛన్నయుద్ధానికి తెరలేపేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కామెంట్ చేసిన నేపథ్యంలో జీ జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అంతర్జాతీయ వ్యవహారాల్లో అభివృద్ధి చెందిన దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. స్థిరమైన అంతర్జాతీయ వ్యవస్థను నెలకొల్పేందుకు యూఎన్ కట్టుబడి ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. బయటి దేశాల సైనిక చర్యతో నష్టమే ఉంటుందన్నారు. చైనా ఎన్నడూ ఏ దేశ ఆక్రమణకు వెళ్లలేదని, ఎవరిపైనా ఆధిపత్యాన్ని చెలాయించదని జిన్‌పింగ్ తెలిపారు. చైనా ప్రజలు ఎప్పుడూ శాంతి, సామరస్యాన్ని కోరుకుంటారని అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. ప్రపంచ శాంతిని నిర్మించేందుకు చైనా ఎప్పుడు తన వంతు పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.