సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు బోర్డు పరీక్ష ఫీజుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు (CBSC Board Exams) హాజరయ్యే విద్యార్థుల్లో కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎలాంటి రిజిస్టేషన్, పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని (cbse news) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పేర్కొంది.
10, 12వ తరగతి పరీక్షల కోసం జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుంది. ‘కొవిడ్-19 మహమ్మారి దేశంలో చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన విద్యార్థుల నుంచి సంబంధించి రిజిస్టేషన్, పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని సీబీఎస్‌ఈ నిర్ణయించింది’ అని సీబీఎస్‌ఈ పరీక్షల అధికారి భరద్వాజ్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. అకాడమిక్ సెషన్ బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అభ్యర్థుల జాబితా లేదంటే అర్హులైన విద్యార్థుల ఎల్‌ఓసీని అప్‌లోడ్ చేయాలని బోర్డు పాఠశాలలను ఆదేశించింది. 10, 12 తరగతులకు చెందిన ఎల్‌ఓసీలను సెప్టెంబర్ నెలాఖరులోగా సమర్పించాలని కోరింది. నిర్ణీత తేదీలోగా పంపడంలో విఫలమైతే ఆలస్య రుసుముతో అక్టోబర్ 9 వరకు పంపొచ్చని చెప్పింది. పూర్తి వివరాలుకు వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.