- 8 మందికి పదోన్నతి.. ఐదుగురికి బదిలీ
- తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్‌చంద్ర
- ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్‌కుమార్
- కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు
- మరో ఆరుగురు జడ్జిల బదిలీకీ నిర్ణయం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజేగా) జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ నియమితులు కానున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీతోపాటు మొత్తం 13 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పేర్లను సిఫారసు చేసింది. 8 మందికి పదోన్నతి కల్పించాలని, మరో ఐదుగురు సిట్టింగ్ సీజేలను బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరింది. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే 13 హైకోర్టులకు కొత్త సీజేలు రానున్నారు. ఈ నెల 16న కొలీజియం చేసిన సిఫారసులను మంగళవారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. సీజేలుగా పదోన్నతికి సిఫారసు చేసిన జడ్జిల పేర్లు… జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ (తెలంగాణ), జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (ఆంధ్రప్రదేశ్), జస్టిస్ రంజిత్ వీ మోర్ (మేఘాలయ), జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ (కోల్‌కతా), జస్టిస్ ఆర్వీ మలిమత్ (మధ్యప్రదేశ్), జస్టిస్ రితూ రాజ్ అవస్థీ (కర్ణాటక), జస్టిస్ అర్వింద్ కుమార్ (గుజరాత్), జస్టిస్ రాజేశ్ బిందాల్ (అలహాబాద్). బదిలీకి సిఫారసు చేసిన హైకోర్టుల సీజేల పేర్లు… జస్టిస్‌లు ఏఏ ఖురేషీ, ఇంద్రజిత్ మహంతి, మహమ్మద్ రఫీక్, బిశ్వనాథ్ సొమద్దర్, ఏకే గోస్వామి. వీరు ప్రస్తుతం వరుసగా త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల సీజేలుగా పనిచేస్తున్నారు. 17 మంది హైకోర్టు జడ్జిల బదిలీ/పునఃబదిలీకి కూడా కొలీజియం సిఫారసు చేసింది. దీంతో పాటు మరో ఆరుగురు హైకోర్టు జడ్జిల బదిలీకి కూడా సిఫారసు చేయాలని మంగళవారం నిర్ణయించింది.
పదోన్నతిలో విద్యార్హత న్యాయమైన ప్రాతిపదికే
న్యూఢిల్లీ: ఒకే హోదాకు చెందిన వ్యక్తుల పదోన్నతి వ్యవహారంలో విద్యార్హతను ప్రాతిపదికగా పరిగణించడం న్యాయబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది రాజ్యాంగంలోని 14, 16 అధికరణల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టంచేసింది. ఒక హోదాకు చెందిన వ్యక్తులకు పదోన్నతుల్లో కోటాను ప్రవేశపెట్టడానికి లేదా ఒక హోదాకే పదోన్నతులను పరిమితం చేయడానికి లేదా ఒక హోదా వారిని మినహాయించడానికి కూడా విద్యార్హతను ప్రాతిపదికగా ఉపయోగించవచ్చని ప్రకటించింది. వర్గీకరణ ప్రాతిపదికకు విలువను నిర్ణయించడం ఏకపక్షంగా లేనంతవరకు కోర్టు జోక్యం చేసుకోబోదని తెలిపింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అసిస్టెంట్ ఇంజినీర్లుగా నియమించేందుకు సబ్-అసిస్టెంట్ ఇంజినీర్లలోని డిప్లమా, డిగ్రీ హోల్డర్లకు వేర్వేరు నిబంధనలు విధిస్తూ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 2012లో ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీనిని కలకత్తా హైకోర్టు సమర్థించింది.
కొవిడ్ చికిత్స ధరలపై నియంత్రణ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్స ధరలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రైవేటు దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలా కాకుండా ఓ విధానము ఉండేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణకు అంగీకరించాలని న్యాయవాది సచిన్ జైన్ కోర్టును కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ చేపడుతామన్నారు.