- నీటిఎద్దడి, చీడపీడలను తట్టుకొనే సామర్థ్యం కూడా..
- ఐకార్ పరిశోధకుల అభివృద్ధి.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
పర్యావరణ మార్పులను తట్టుకుంటూ పోషకాహార లోపాన్ని తరిమికొట్టే విలక్షణమైన 35 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. వీటిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్ (ఐకార్) పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వర్చువల్‌గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ పంట రకాలను తయారుచేసినట్టు చెప్పారు. నీటిఎద్దడి, చీడపీడలను తట్టుకొని ఇవి బతుకగలవని పేర్కొన్నారు. అనంతరం రైతులతో కాసేపు ముచ్చటించారు.
హైదరాబాద్ ఐకార్ నుంచి ఐదు కొత్త వరి వంగడాలు
ఐకార్ పరిశోధకులు అభివృద్ధి చేసిన మొత్తం 35 కొత్త వంగడాల్లో ఐదు కొత్త వరి వంగడాలు కూడా ఉన్నాయి. వీటిని హైదరాబాద్‌లోని ఐకార్-ఐఐఆర్‌ఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఐదు వంగడాల్లో డీఆర్‌ఆర్ ధన్-57 రకం వరి వంగడం తక్కువ నీరు ఉన్నప్పటికీ తట్టుకోగలదు. తక్కువ సమయంలోనే పండుతుంది. మరో నాలుగు రకాలు.. డీఆర్‌ఆర్ ధన్-58, డీఆర్‌ఆర్ ధన్-59, డీఆర్‌ఆర్ ధన్-60, డీఆర్‌ఆర్ ధన్-62 ఇవి మీడియం సన్నని రకం ధాన్యాలు… ఇవి ముడత రోగాన్ని తట్టుకోగలవు.