- పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి గుడ్‌బై
- 3 నెలల్లోనే వైదొలిగిన మాజీ క్రికెటర్
- రాజీ పడలేనంటూ సోనియాకు లేఖ
- మాజీ సీఎం అమరిందర్ ఢిల్లీకి పయనం
- బీజేపీ అగ్రనేతలతో భేటీకేనని వార్తలు
- సిద్ధూ పంజాబ్‌కు పనికిరాడని విమర్శ
- ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో సంక్షోభం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రతరమైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. మరోవైపు, సిద్ధూతో వైరం నేపథ్యంలో ఇటీవల సీఎం పదవిని వీడాల్సి వచ్చిన కాంగ్రెస్ కురువృద్ధుడు అమరిందర్ సింగ్ బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన అనంతరం పార్టీ సారథ్య బాధ్యతల నుంచి సిద్ధూ వైదొలగడం గమనార్హం. ఆదివారం 15 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అమరీందర్‌తో ఆధిపత్య పోరు నేపథ్యంలో ఆయన వ్యతిరేకిస్తున్నా జూలైలో సిద్ధూకు అధిష్ఠానం పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత ఇద్దరు నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పది రోజుల కిందట సీఎం పదవికి అమరిందర్ రాజీనామా చేస్తూ పార్టీ హైకమాండ్ తనను అవమానించిందని ఆక్రోశం వెళ్లగక్కారు. సిద్ధూ ‘ప్రమాదకారి, దేశ వ్యతిరేకి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను ఓడిస్తానని ప్రతినబూనారు. కాగా, సిద్ధూ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించలేదని, రాష్ట్ర నాయకులు మొదట తమ స్థాయిలో విభేదాలను పరిష్కరించు కోవాలని సూచించినట్టు తెలిసింది.
రాజీ పడలేను.. అందుకే: సిద్ధూ
‘రాజీ పడిపోవటంతోనే మనిషి వ్యక్తిత్వం పతనమవటం మొదలవుతుంది. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమంపై నేను రాజీ పడలేను’ అని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో సిద్ధూ పేర్కొన్నారు. కాబట్టి పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, పార్టీకి తన సేవలను కొనసాగిస్తానని తెలిపారు. తన రాజీనామాకు కారణాలు ఏమిటనేది మాత్రం వివరించలేదు. సిద్ధూ నిర్ణయం ఆయన వ్యూహంపై ఊహాగానాలకు తెరతీసింది. బీజేపీ నుంచే ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దళితుడైన చన్నీని సీఎంను చేయడం వల్లే సిద్ధూ రాజీనామా చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.
సిద్ధూకి మద్దతుగా మహిళా మంత్రి రాజీనామా
సిద్ధూకి సంఘీభావంగా రజియా సుల్తానా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుల్తానా భర్త మాజీ ఐపీఎస్ అధికారి. సిద్ధూకి ఆయన ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
కథ అడ్డం తిరిగింది!
అధిష్ఠానానికి సిద్ధూ షాక్ ఇచ్చారు. సిద్ధూ ఒత్తిడితోనే సీఎంగా అమరిందర్‌ను అధిష్ఠానం తప్పించింది. పార్టీలో సంక్షోభం సద్దుమణుగుతుందని ఆశించింది. అయితే కథ అడ్డం తిరిగింది. అమరిందర్‌ను కుర్చీ నుంచి దించే వరకు నిద్రపోని సిద్ధూ అంతలోనే కాడె వదిలేశారు. సన్నిహితుడు అనుకున్న సీఎం చన్నీ… మంత్రి పదవులు కేటాయింపులో తీసుకున్న నిర్ణయాలు సిద్ధూకి నచ్చలేదని చెబుతున్నారు. ‘సూపర్ సీఎం’ అని భావించిన సిద్ధూను అధికారుల నియామకం, మరికొన్ని కీలక నిర్ణయాల విషయంలో చన్నీ విస్మరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన రాజీనామా చేశారు.
నేను ముందే చెప్పా: అమరిందర్
‘సిద్ధూ నిలకడ లేని మనిషి అని, సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు పనికిరాడని అధిష్ఠానానికి ముందే చెప్పా’ అని అమరిందర్ తెలిపారు. ఈ నెల 18న సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా ఆయన మంగళవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నేతలను కలిసేందుకే ఆయన ఢిల్లీ పయనమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే సొంత పనిమీద ఢిల్లీ వెళుతున్నానని, మీడియా అనవసరంగా ఊహాగానాలు అల్లుతున్నదని ఆయన అన్నారు. అమరీందర్ రావడానికి ముందు హిమాచల్‌ప్రదేశ్ నుంచి సోనియా, రాహుల్ కూడా చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ నుంచే వారు ఢిల్లీ వెళ్లారు.