జాతీయం ముఖ్యాంశాలు

అందరినీ బలిచేయలేం

  • కొందరికి ఉపాధి పేరుతో ఇతరుల జీవించే హక్కును భంగపరచలేం
  • పటాకులపై సుప్రీం కీలకవ్యాఖ్యలు
  • సమతూకం పాటించాలని సూచన

పటాకుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరికి ఉపాధి సమకూరుస్తున్నామనే పేరుతో ఇతరుల జీవించే హక్కును భంగపరచలేమని స్పష్టంచేసింది. పటాకులను నిషేధించాలన్న పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎంఆర్‌ షా, ఏఎస్‌ బోపన్నతో కూడిన ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. ఉపాధి, నిరుద్యోగం, జీవించే హక్కు.. ఈ మూడింటి మధ్య సమతూకం పాటించాల్సి ఉందని తెలిపింది. ‘మా దృష్టి అంతా అమాయక పౌరుల జీవించే హక్కు మీదే ఉంది’ అని ధర్మాసనం పేర్కొన్నది. పర్యావరణ అనుకూల పటాకులు ఏవైనా ఉన్నాయని ఎవరైనా చెప్తే, దానిని నిపుణుల కమిటీ ధ్రువీకరిస్తే మేం తగిన ఉత్తర్వులు ఇస్తాం అని తెలిపింది. ‘చట్టాలు ఈసరికే ఉన్నాయి. అయినా అంతిమంగా కావాల్సింది అమలు చేయడం. మా ఆదేశాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి’ అని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని పటాకుల ఉత్పాదకుల తరఫు న్యాయవాది ఆత్మారాం నడ్కర్ణీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు చాలానే ఉన్నా ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని పిటిషనర్‌ అర్జున్‌ గోపాల్‌ తరఫు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ కోర్టుకు తెలిపారు. పటాకుల మంచిచెడ్డలను నిర్ధారించే పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పీఈఎస్‌వో)ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. పరోక్షంగా బేరియం నైట్రేట్‌పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పటాకులనేవి ఏదో బాత్రూంలో చాటుమాటుగా పీల్చే మాదకద్రవ్యాలు కావని, యథేచ్ఛగా నడుస్తున్న పటాకుల వినియోగాన్ని అదుపు చేయడంలో పరిపాలనా వ్యవస్థ విఫలమైందని చెప్పారు. పెండ్లిళ్లు, ఊరేగింపులు, మతకార్యక్రమాల్లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరుగుతున్నదని ధర్మాసనం తెలిపింది. ఎవరో ఒకరిని జవాబుదారు చేయాలని.. లేకపోతే ఇది ఆగదని అభిప్రాయపడింది.