మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్‌లో ఓ పొరపాటు చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి సదరు హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న నర్స్ పొరపాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై స్పందించిన ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సదరు నర్స్ కీర్తి పోపరేను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం కల్వాలోని అత్కోనేశ్వర్ హెల్త్ సెంటర్‌కు రాజ్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి కొవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం వచ్చారు. అయితే, ఆయన ఏఆర్వీ వ్యాక్సినేషన్ చేస్తున్న క్యూలో నిలుచున్నాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నర్స్ కీర్తి పోపరే.. సదరు వ్యక్తి కేస్ పేపర్ చూడకుండానే వ్యాక్సిన్ ఇచ్చేశారు.
ఈ సమాచారం తెలియడంతో సదరు రాజ్‌కుమార్ యాదవ్‌ను దవాఖానలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. సంబంధిత పేషంట్ కేస్ పేపర్ చూడటం నర్స్ డ్యూటీ అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఆమె నిర్లక్ష్యం వల్ల సదరు వ్యక్తికి ప్రాణాపాయం ఏర్పడిందన్న ఆరోపణను కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు.