క్రీడలు జాతీయం ముఖ్యాంశాలు

కోహ్లి కెప్టెన్సీపై ర‌హానే, పుజారా అసంతృప్తి.. బీసీసీఐకి ఫిర్యాదు!

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ అసంతృప్తిగా ఉన్నారా? ర‌హానే, పుజారాలాంటి సీనియ‌ర్లు అత‌ని కెప్టెన్సీపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారా? అందుకే తాజాగా విరాట్ టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడా? న్యూ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌లో వ‌చ్చిన ఓ సంచ‌ల‌న క‌థ‌నం ఈ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌లో టీమిండియా ఓడిన త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌న‌ల గురించి ఈ క‌థ‌నం వివ‌రించింది.

ఆ మ్యాచ్ త‌ర్వాత ఏం జ‌రిగింది?

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో టీమిండియా అనూహ్యంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 170 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌డంతో కోహ్లి సేన‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. అయితే ఈ మ్యాచ్ త‌ర్వాత సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ పుజారా, ర‌హానేల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతుల్లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 80 బంతుల్లో 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అటు ర‌హానే కూడా తొలి ఇన్నింగ్స్‌లో 117 బంతుల్లో 49, రెండో ఇన్నింగ్స్‌లో 40 బంతుల్లో 15 రన్స్ చేశాడు.

ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ల గురించి మ్యాచ్ త‌ర్వాత కోహ్లి ప‌రోక్షంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశాడు. ఎలాగోలా ప‌రుగులు చేయాల‌న్న మైండ్‌సెట్‌తో ప్లేయ‌ర్స్ ఉండాలి కానీ అవుట‌వుతామ‌న్న భ‌యంతో ఆడితే బౌల‌ర్‌దే పైచేయి అవుతుంది అని కోహ్లి అన్నాడు. దీనిపై పుజారా, ర‌హానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాకు ఫోన్ చేసిన‌ట్లు ఆ క‌థ‌నం వెల్ల‌డించింది. కోహ్లి కెప్టెన్సీపై ఈ ఇద్ద‌రూ అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలిపింది. దీంతో బీసీసీఐ ఇత‌ర ప్లేయ‌ర్స్ అభిప్రాయాలు కూడా తీసుకుంది.

అందుకే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడా?

ఇంగ్లండ్ టూర్ ముగిసిన త‌ర్వాత కోహ్లి అంశంపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవాల‌ని భావించింది. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్ నుంచి రాగానే కోహ్లి తాను టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు చెప్ప‌డం వెనుక కార‌ణం కూడా అదేన‌న్న భావ‌న బ‌ల‌ప‌డింది. అంతేకాదు వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత కోహ్లి వ‌న్డే కెప్టెన్సీపైనా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.
ఈ ఇద్ద‌రే కాదు కోహ్లి తీరుపై సీనియ‌ర్ బౌల‌ర్ అశ్విన్ కూడా అసంతృప్తిగా ఉన్న‌ట్లు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ గ‌త వారం ఓ క‌థ‌నం రాసింది.

ఇంగ్లండ్ టూర్‌లో అశ్విన్ ఉన్నా కూడా అత‌న్ని ఒక్క టెస్ట్‌లో కూడా కోహ్లి ఆడించ‌లేదు. నాలుగో టెస్ట్‌లో అశ్విన్‌ను ఆడించాల‌ని కోచ్ ర‌విశాస్త్రి చెప్పినా.. కోహ్లి వినలేద‌ట‌. దీంతో కోహ్లి తీరుపై అశ్విన్ గుర్రుగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు తాజాగా అశ్విన్‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయ‌డం కూడా కోహ్లి ఇష్టం లేద‌ని తెలిసింది.