అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

Oxford study : కరోనాతో 2 ఏండ్లు తగ్గిన ఆయువు

 (Oxford study) కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలతో ఇప్పటికీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలకు మరో నష్టం కూడా జరుగనున్నది. అది మనిషి ఆయుర్దాయం గణనీయంగా క్షీణించడం. కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఒక వ్యక్తి సగటు ఆయుర్దాయం తగ్గిపోతున్నది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ ఆయుర్దాయం క్షీణించడం ఇదే.

ఐరోపా దేశాలు, అమెరికా, చిలీతో పాటు 29 దేశాలకు గాను 27 దేశాలతో 2019 తో పోలిస్తే ఇప్పుడు ఆయుర్దాయం తగ్గిందని పరిశోధనలో తేలింది. చాలామంది అమెరికన్ పురుషుల ఆయుర్దాయం 2.2 సంవత్సరాలకు పైగా తగ్గినట్లు గుర్తించారు. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా మరణించారు.

‘పరిశోధన ప్రకారం చాలా దేశాల్లో మహిళల కంటే పురుషుల ఆయుర్దాయం మరింత క్షీణించింది. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఏడాదికి పైగా తగ్గింది. 11 దేశాల్లో మహిళల ఆయుర్దాయం తగ్గుదల గమనించారు’ అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన రీసెర్చ్ పేపర్ కో-హెడ్, రచయిత డాక్టర్ రిద్ధి కశ్యప్ తెలిపారు.

కరోనా మూలాన్ని మళ్లీ పరిశీలిస్తాం: డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్ ఆరిజిన్‌ను తిరిగి పరిశీలించాలని నిర్ణయించింది. దీని కోసం 20 మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి బృందానికి చైనా అందించిన డాటా సరిపోదని తేలినందున డబ్ల్యూహెచ్‌ఓ మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వైరస్ మూలం గురించి యూఎన్‌ బృందానికి చైనాలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.