ఆంధ్రప్రదేశ్

100 రోజుల పాటు ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం: పెద్దిరెడ్డి

అక్టోబర్ 2న విజయవాడలో క్లాప్, ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వంద రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్, ‘జగనన్న స్వచ్ఛసంకల్పం’ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన తాడేపల్లిలోని పీఆర్‌,ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైఎస్సాఆర్‌ ఆసరా, చేయూత, ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై జిల్లా కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలన్నది సీఎం జగన్ ఆశయమని తెలిపారు.

కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించిన పచ్చదనం-పరిశుభ్రతా పక్షోత్సవాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని గుర్తుచేశారు. గ్రామాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ప్రజాభాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంకల్పం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 7న సీఎం వైఎస్‌ జగన్ ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అర్హత ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళల వ్యక్తిగత ఖాతాలకే ఆసరా సొమ్మును జమ చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ పదిరోజుల పాటు ఆసరా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఆసరా అమలులో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.

మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాలనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని, అందుకు అవసరమైన సహకారంను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మార్కెటింగ్, రుణాల లభ్యత విషయంలో జిల్లా కలెక్టర్లు ఎస్‌హెచ్‌జీ మహిళలకు మార్గదర్శనం చేయాలని అన్నారు.