జాతీయం

ప్రజారోగ్యంలో విప్లవాత్మక ముందడుగు : వెంకయ్యనాయుడు

(Venkaiah Naidu) భారతదేశంలో ప్రజారోగ్య సంబంధ విషయాల్లో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి భారతీయుడు స్వచ్ఛందంగా భాగస్వామి కావాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికీ ప్రత్యేకమైన ఆరోగ్య గుర్తింపు కార్డుతోపాటు ఆరోగ్య వివరాలన్నీ డిజిటటైజేషన్‌ చేయడం వల్ల చికిత్స అందించడం సులభం అవుతుందన్నారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన చేకూర్చేందుకు, వారిలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ రూపొందించిన జాతీయ హెల్ప్‌లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ఉపరాష్ట్రపతి గురువారం ప్రారంభించి మాట్లాడారు.

రొమ్ము క్యాన్సర్‌ విషయంలో మహిళల్లో చైతన్యం కల్పించేందుకు డాక్టర్ పీ రఘురామ్, డాక్టర్ ఉషాలక్ష్మి బృందం చేస్తున్న ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. తెలుగు, కన్నడ, తమిళం సహా 11 భారతీయ భాషల్లో ఈ హెల్ప్‌ లైన్ నడపాలన్న ఆలోచనను ప్రశంసించారు. వ్యాధుల తీవ్రత విషయంలో గణాంకాలను చూసి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. అయితే నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని ఈ లెక్కలు గుర్తుచేస్తాయన్నారు.

మారుతున్న జీవనశైలి కారణంగానే మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. వ్యాయామం, ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని జయించడం వంటివి నిత్య జీవితంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా కొంతమేర ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషాలక్ష్మి, డాక్టర్ పీ రఘురామ్, తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇన్ ఇండియా ప్రతినిధులు, బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.