పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నేపథ్యంలో సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన ఇంటి వద్ద బుధవారం కార్యకర్తలు నిరసనకు దిగడంతో పాటు కారును సైతం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఆ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మతో పాటు పలువురు జీ-23 (గ్రూప్ ఆఫ్ 23) నేతలు ఖండించారు. నిరసన, దాడిని ‘ప్రణాళికాబద్ధమైన గూండాయిజం’గా ఆజాద్ అభివర్ణించారు. నిరసన చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు.
విదేశాంగశాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ సైతం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘అతను (కపిల్ సిబల్) పార్టీ నాయకత్వానికి నచ్చని వాటిపై మాట్లాడినందుకే ఇదంతా జరిగిందన్నారు. పార్లమెంట్‌లో, వెలుపల పార్టీ కోసం పోరాడుతున్న నమ్మకమైన నేత అని ఆజాద్ ట్వీట్ చేశారు. ఆయన సలహాలను స్వాగతించాలి.. గూండాయిజం ఆమోదయోగ్యం కాదన్నారు. దాడి ఘటన వార్తలు విన్నప్పు తాను షాక్ గురయ్యానని, ఇలాంటి చర్యలు పార్టీ పరువు తీస్తాయని.. వీటిని ఖండించాలని ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు.
అసహనం, హింస కాంగ్రెస్ విలువలు, సంస్కృతికి పూర్తిగా భిన్నమైనవని అన్నారు. బాధ్యతులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సోనియాను కోరారు. ఎంపీ మనీష్ తివారి సైతం ఘటనను ఖండించారు. సిబల్ పార్లమెంట్‌లో, వెలుపల పార్టీ కోసం పోరాడుతున్నాడని.. ఈ దాడికి పథకం వేసిన వారు అర్థం చేసుకోవాలన్నారు. దాడి ఘటన సిగ్గుచేటని శశిథరూర్ అన్నారు. ‘కపిల్ సిబల్ నిజమైన కాంగ్రెస్ నాయకుడు అని మనందరికీ తెలుసు. ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా, ఆయన (కపిల్ సిబల్) ఏమి చెబుతున్నారో మనం వినాల్సిన అవసరం ఉందని’ థరూర్ అన్నారు.
కపిల్ సిబల్ ఏమన్నారంటే..
పంజాబ్‌లో పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవడం తదితర ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం కపిల్ సిబల్ స్పందిచంచారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు లేరు. మరి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.. మాకైతే ఆ విషయం తెలియదు.. మేం జీ-23 నేతలమే.. కానీ, జీహుజూర్ 23 నేతలం కాదు.. సమస్యలు, లోపాలను ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని సిబల్ పేర్కొన్నారు.
పార్టీ వెంటనే కార్యనిర్వాహక కమిటీ (CWC) సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయాలపై బహిరంగంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలు ఢిల్లీలోని జోర్‌బాగ్‌లోని సిబల్ ఇంటి ఎదుట గుమిగూడారు. ఇంటిపై టమాటాలు విసిరారు. కారును సైతం ధ్వంసం చేశారు. ‘గెట్ వెల్ సూన్ కపిల్ సిబల్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.