ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య మాటల యద్ధం కొనసాగుతోంది. నిన్న మంగళగిరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ గురువారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు సవాల్ విసిరారు. జగన్‌ను ఓడించే సత్తా పవన్‌కు లేదన్నారు. జగన్‌ను పవన్ కల్యాణ్ ఓడిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ‘నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకో.. 2024లో నువ్వు ఏం చేస్తావో చూస్తా’ అన్నారు. ‘చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా.. మేం చూసుకుంటాం.. మమ్మల్ని పవన్ కల్యాణ్ భయపెట్టేందేంటి.. ఇంకో జాని సినిమా చూసి భయపెడుతారా?’ అంటూ సెటైర్లు వేశారు.
పవన్‌ను చూసి ఆయన అభిమానులు భయపడుతారని, జగన్ సోనియాకే భయపడలేదన్నారు. చంద్రబాబు స్క్రిప్టులు చదివి మమ్మల్ని భయపెడుతారా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి పవన్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని, ప్రభుత్వ కార్యక్రమాలే గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ‘ఎన్నికల్లో ధైర్యంగా ముందుకెళ్తాం.. కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. బద్వేల్‌లో గెలుస్తామని ధైర్యంగా చెప్పే ధైర్యం పవన్‌కు ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌పై ద్వేషంతో పవన్ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్, మనోహర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.