Amazon GIF | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ నెల మూడో తేదీ నుంచి కస్టమర్ల కోసం అందుబాటులోకి తెస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఏఫ్) వల్ల తెలంగాణలో 31 వేల మందికి పైగా వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వ్యాపారులకు ప్రయోజనం లభించనున్నది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్-2021)ను అమెజాన్ దేశవ్యాప్తంగా 450 నగరాల పరిధిలో 75 వేలపై చిలుకు స్థానిక దుకాణాలతోపాటు లక్షల మంది చిన్న వ్యాపారులకు అంకితం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వస్తువులపై ఆఫర్లు అందిస్తోంది అమెజాన్ జీఐఎఫ్.
అమెజాన్‌లో లక్షల మంది విక్రేతలు పార్టనర్స్
అమెజాన్ లాంచ్‌పాడ్, అమెజాన్ సాహెలీ, అమెజాన్ కరిగార్ వంటి ఇతర అమెజాన్ ప్రోగ్రామ్స్‌లో భాగస్వాములైన లక్షల మంది అమెజాన్ విక్రేతల వద్ద భారత్, గ్లోబల్ ప్రధాన బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ఎదుర్కొన్న సవాళ్ల నుంచి ఈ ఫెస్టివ్ సీజన్‌లో అమెజాన్ వ్యాపారులు తిరిగి కోలుకునేలా చేయడంపై ఫోకస్ చేశాం అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ సుమిత్ సహాయ్ అని వెల్లడించారు.
ఫెస్టివ్ సీజన్‌లో వృద్ధిపై వ్యాపారుల ఫోకస్
ఇప్పటివరకు ఎదురైన సమస్యల నుంచి కోలుకుని తమ కుటుంబ జీవనాన్ని గాడిలోకి తెచ్చుకునేందుకు మా వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో వారు తమ వ్యాపార వృద్ధిని వేగవంతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు అని అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ సుమిత్ సహాయ్ చెప్పారు.తెలంగాణ వ్యాప్తంగా మాకు 31 వేల మందికి పైగా వ్యాపారులు భాగస్వాములుగా ఉన్నారని, వారికి జీఐఎఫ్‌తో లబ్ధి చేకూరుతుందన్నారు.