ఆంధ్రప్రదేశ్

AP: ‘పురసేవ’లో సర్కార్‌ సక్సెస్‌

మునిసిపాలిటీల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

జనవరి నుంచి ఈ నెల 24 వరకు ఆన్‌లైన్‌లో అందిన ఫిర్యాదులు 45,043 

వీటిలో 44,671 సమస్యలకు పరిష్కారం

‘స్పందన’లో 14,610 ఫిర్యాదులు రాగా 14,005 పరిష్కారం

ఆన్‌లైన్‌ ఫిర్యాదుల కోసం పురసేవ యాప్‌    

వెలగని వీధి లైట్లు.. అస్తవ్యస్తంగా చెత్త సేకరణ.. అపరిశుభ్ర పరిసరాలు.. పొంగుతున్న డ్రైన్లు.. ఇలా పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. ఆయా సమస్యలను నిర్దేశించిన గడువులోగా మున్సిపల్‌ శాఖ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 17 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, ఆరు సెలక్షన్‌ గ్రేడ్, ఏడు స్పెషల్‌ గ్రేడ్, 15 ఫస్ట్‌ గ్రేడ్, 30 సెకండ్‌ గ్రేడ్, 19 థర్డ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలు, 30 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 40.83 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి మున్సిపల్‌ శాఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాలను అందుబాటులో ఉంచింది. అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తోంది. 

95.85 శాతం ఫిర్యాదుల పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పందన కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల నుంచి వార్డు సచివాలయాల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో స్పందన పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులను తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు స్పందనలో 14,610 ఫిర్యాదులు అందగా ఇప్పటివరకు 14,005 (95.85 శాతం) ఫిర్యాదులను అధికారులు పరిష్కరించారు. 

99.17 శాతం పరిష్కారం
ఇక ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకు 45,043 ఫిర్యాదులు అందగా 44,671 (99.17 శాతం) ఫిర్యాదులను పరిష్కరించారు. ఇందులో 61.39 శాతం ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగానే పరిష్కరించారు. ఆన్‌లైన్‌లో అందే ప్రతి ఫిర్యాదు వార్డు సచివాలయంలోని సంబంధిత ఉద్యోగికి చేరుతుంది. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. ఆ మరుసటి రోజే సచివాలయ ఉద్యోగిపై అధికారికి ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు బదిలీ అవుతుంది. ఆన్‌లైన్‌ ఫిర్యాదులపై పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలను అనుసంధానిస్తూ సచివాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంది.

ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఫిర్యాదులు పరిష్కరిస్తున్న వి«ధానాన్ని మునిసిపాలిటీల వారీగా పర్యవేక్షిస్తున్నారు. cdma. ap. gov. inలో, పురసేవ మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను జత చేయాలి. ప్రతి ఫిర్యాదుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఫిర్యాదుదారులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. నాయక్‌ తెలిపారు.