ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ కర్నాల్‌లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు తోసుకురాగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. బీజేపీ ఎమ్మెల్యే అసీం గోయల్ నివాసాన్ని కూడా రైతులు ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది.
పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరణను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 11 వరకూ ఇరు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ చేపట్టాల్సి ఉంది . ఇక రైతుల ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. రైతు సంఘాల నేతలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. అకాల వర్షాలు, పలు ప్రాంతాల్లో పంట చేతికిరాకపోవడం వంటి కారణాలతోనే ధాన్యం సేకరణలో జాప్యం వాటిల్లుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.