రైతుల నిరసనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపింది. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిని అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యమైందని పేర్కొంది.
కాగా, కేవలం పంజాబ్, హర్యానాలో మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలును కేంద్రం ఆలస్యం చేయడంపై రైతులు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం హర్యానా, పంజాబ్‌లో రైతులు నిరసన చేపట్టారు. హర్యానాలోని అధికార బీజేపీ, జేపీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం ఇండ్ల ముందు ఆందోళన చేశారు. రైతుల నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించారు. పంజాబ్‌లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన తెలిపారు.
రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. పంజాబ్, హర్యానాలో ఆదివారం నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే శనివారం తెలిపారు. ఈ అంశంపై తనను ఢిల్లీలో కలిసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి ఈ మేరకు సంయుక్తంగా ప్రకటించారు.