జాతీయం

Navy Personnel : హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం

(Navy Personnel) ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో హిమపాతం సంభవించింది. త్రిశూల్‌ పర్వతం అధిరోహించేందుకు వచ్చిన నేవీ బృందంలోని ఆరుగురు కనిపించకుండా పోయినట్లు సమాచారం. వారిని గుర్తించేందుకు రిలీఫ్‌-రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. వీరికి తోడుగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా గాలిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో శుక్రవారం భారీగా హిమపాతం సంభవించింది. బాగేశ్వర్‌ జిల్లాలోని పశ్చిమ కుమావ్‌ ప్రాంతంలోని 7,120 మీటర్ల ఎత్తైన త్రిశూల్‌ పర్వతాన్ని అధిరోహిస్తున్న 20 మంది సభ్యులు గల నేవీ పర్వతారోహణ బృందంలోని ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఐదుగురు సిబ్బంది, తోడుగా ఉన్న కూలీని హిమపాతం చుట్టేసింది. సమాచారం అందగానే నేవీ గాలింపు చర్యలను ప్రారంభించింది. నెహ్రూ పర్వతారోహణ సంస్థ నుంచి రిలీఫ్-రెస్క్యూ టీం కూడా మౌంట్ త్రిశూల్‌కు బయల్దేరి వెళ్లింది.

ఈ 20 మంది సభ్యుల యాత్ర సెప్టెంబర్ 3 న ముంబై నుంచి ప్రారంభమైంది. వీరిలో 10 మంది పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకునే చివరి దశలోకి వచ్చారు. అయితే ఆకస్మికంగా హిమపాతానికి గురవడంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతావారి ఆచూకీ కనుగొనేందుకు భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్‌ఎఫ్‌) ప్రయత్నిస్తున్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. ఇటీవల, హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పిటిలో ట్రెక్కింగ్ కోసం ఖామిగర్ హిమానీనదంలో 16 మంది ట్రెక్కింగ్ బృందం తప్పిపోయింది. ఇందులో 11 మంది సభ్యులు క్షేమంగా బయటపడ్డారు.