సాంకేతిక కారణాలతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూడు సేవలకు అంతరాయం కలిగించినందుకు చింతిస్తూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు నెటిజన్లకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై ఎంత ఆధారపడుతారో తమకు తెలుసు అని.. ఈ అంతరాయం కలిగించినందుకు క్షమించండి అని మార్క్ జుకర్‌బర్గ్ కోరారు.
ఈ అంతరాయంపై ట్విట్టర్ కూడా స్పందించింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఈ రోజు వాట్సాప్‌ను ఉపయోగించలేకపోయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. వాట్సాప్ మళ్లీ పని చేయడం ప్రారంభించింది. మీ సహనానికి చాలా ధన్యవాదాలు. మీకు మరింత సమాచారం ఇచ్చి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని ట్వీట్‌లో అభిప్రాయపడింది.
దాదాపు 7 గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సాప్‌తో పాటు మిగతా సేవలు పునరుద్ధరించబడ్డాయి. సాంకేతిక కారణాలతో ఈ మూడు సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు కొన్ని గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంతో.. మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది.