ఇటీవల సంచలనాత్మకంగా మారిన ముంబై రేవ్ పార్టీ కేసులో అరెస్టుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ కాగా, తాజాగా ఈ సాయంత్రం మరో నలుగురు నిందితులను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 16కు పెరిగింది. ఈ సాయంత్రం అరెస్టయిన నలుగురూ క్రూయిజ్ షిష్‌లో రేవ్ పార్టీ నిర్వహించిన ఈవెంట్ కంపెనీకి సంబంధించిన వారని అధికారులు తెలిపారు.
ఇటీవల ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ 10 మంది యువకులు, ముగ్గురు యువతులు పట్టుబడ్డారు. ఎన్సీబీ అధికారులు రైడ్ చేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో బాలీవుడ్ ప్రముఖ హీరో షారూఖ్‌ఖాన్ కొడుకు కూడా ఉన్నాడు. వీరందరినీ విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు షారూఖ్ కొడుకు సహా మొత్తం 16 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.