లఖింపూర్ ఖేరిలో నిరసన తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించిన రైతులను కేంద్ర మంత్రి కాన్వాయ్‌లోని వాహనంతో తొక్కించి చంపిన ఘటనపై యూపీలో తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఈ క్రమంలోనే ఈ ఘటనలో మరణించిన ముగ్గురు రైతుల కుటుంబసభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించారు. అయితే, అంతకుముందు వారు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెగేసి చెప్పారు.
ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు, పోస్టుమార్టం నివేదికలను తమకు ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని లేదంటే లేదని వారు స్పష్టంచేశారు. ఇప్పుడు వారి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో అంత్యక్రియలు సమ్మితించినట్లు సమాచారం. కాగా, ఈ నెల రెండున లఖింపూర్ ఖేరిలో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రికి వ్యవసాయ చట్టాలపై తమ నిరసన తెలిజేసేందుకు కొందరు రైతులు రోడ్డులపై బైఠాయించారు.
అటుగా మంత్రి కాన్వాయ్ అటుగా రాగానే పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో ఓ వాహనం రైతులపైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులను తొక్కించిన వాహనాన్ని మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశీష్ మిశ్రా నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ మంత్రి అజయ్ మిశ్రా మాత్రం ఘటన జరిగిన సమయంలో తానుగానీ, తన కొడుకుగానీ అక్కడ లేమని చెప్పారు.