పొరుగున ఉన్న మయన్మార్ నుంచి మిజోరాంకు శరణార్థులు పోటెత్తుతున్నారు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న చిన్ రాష్ట్రంలోని గ్రామాలపై ఆ దేశ సైన్యం గత కొంతకాలంగా గుండ్ల వర్షం కురిపిస్తున్నది. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు ఊర్లను ఖాళీ చేస్తున్నారు. కొండలు, గుట్టలు, వాగులు వంకలు, నదులను దాటుతూ మిజోరాంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 12,121 మంది శరణార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారని మిజోరాం హోం మంత్రి లాల్చామలియనా వెల్లడించారు.
ఒక్క నహ్‌థియాల్ జిల్లాలోనే చిన్ రాష్ట్రానికి చెందిన రెండు వేల మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. గత నెలలో మిజోరాం-మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై మయన్మార్ సైన్యం విమానాల ద్వారా దాడులకు పాల్పడింది. దీంతో మయన్మార్ శరణార్థులు నదిని దాటి, కొండ ప్రాంతాలను దాటుకుని మిజోరాంలోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు.
మిజోరాంలోని చంపాయ్, సియాహా, లవగ్లాయ్, సెర్చిప్, నహ్‌థియాల్, సైతుయాల్ జిల్లాలు మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల మేర సరిహద్దును కలిగి ఉన్నాయి.