తెలంగాణ

అంగట్లో ఆర్డ్‌నెన్స్‌.. దేశరక్షణకే ప్రమాదం

  • లక్షల కోట్ల విలువైన భూములకు కేంద్ర ప్రభుత్వం ఎసరు?!
  • ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ప్రై‘వేటు’ వెనుక బీజేపీ సర్కార్‌ కుట్ర!
  • దేశవ్యాప్తంగా 41 ఓఎఫ్‌బీలు, 62 వేల ఎకరాల భూములు
  • మెషినరీ, భూములు కలిపితే లక్షల కోట్లలో విలువ
  • మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీకి 3,500 ఎకరాల భూమి
  • మెషినరీ, భూమి కలిపితే దీని విలువ 2 లక్షల కోట్లు
  • విలువైన భూములు ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకే ఓఎఫ్‌బీలను నిర్వీర్యం చేస్తున్నారంటున్న కార్మిక సంఘాలు

దేశరక్షణకే ప్రమాదం

కీలక సంస్థను ప్రైవేటుకు అప్పజెపితే దేశ రక్షణకు విఘాతం కలుగుతుంది. కేంద్రం ఈ విషయంలో పునరాలోచన చేయాలని మా విన్నపం. ఇప్పుడు డీపీఎస్‌యూలుగా ఉంచినా రానున్న కాలంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగాల కల్పన కూడా కష్టమవుతుంది.
శ్రీకుమార్‌, జనరల్‌ సెక్రటరీ, ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

అమ్మడం తప్ప ఆర్జించడం తెలియని కేంద్ర సర్కారు.. మరో దారుణ కుట్రకు తెరలేపింది. 221 ఏండ్ల చరిత్ర కలిగిన ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు అడుగులు వేస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్ల (డీపీఎస్‌యూ)ను ఏర్పాటు చేస్తున్నామన్న ముసుగులో క్రమంగా ప్రైవేట్‌ వ్యక్తులకు దేశంలోని 41 ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ భూములను కట్టబెట్టాలని యత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ భూముల మొత్తం విలువ ప్రభుత్వ ధరల ప్రకారం తీసుకొంటేనే లక్షల కోట్లు దాటుతుందని, మార్కెట్‌ విలువలో చూస్తే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువగా ఉంటుందని.. ఇంత విలువైన భూములను హాంఫట్‌ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలోని మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీకి కూడా రూ.3,500 ఎకరాల భూమి ఉన్నదని ప్రస్తుతం ఎకరా రూ.5 కోట్ల వరకు ధర పలుకుతుందన్నారు.

మెదక్‌ ఓడీఎఫ్‌ విలువ రూ.2 లక్షల కోట్లు

దేశ రక్షణ కోసం మెదక్‌లో ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు.. రైతులు తమ భూములను త్యాగంచేశారు. మొత్తంగా 3,500 ఎకరాలను సేకరించి మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. ఇప్పుడు అదే భూమి విలువ ఎకరా రూ.5 కోట్లకు చేరిందని కార్మికవర్గాలు చెప్తున్నాయి. అంటే.. ఇక్కడొక్క చోటనే రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉన్నది. ‘దేశవ్యాప్తంగా ఉన్న 41 ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకు రూ.30 వేల కోట్లు ఇవ్వండి.. మీరు టార్గెట్లు పెట్టండి.. మేము ఐదేండ్లలో రూ.45 వేల కోట్ల ఉత్పత్తులు చేసి చూపుతాం అని కేంద్రానికి చెప్పాం’ అని కార్మికులు తెలిపారు. అయినా కేంద్రం వినిపించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

మమ్మల్ని సంప్రదించలేదు

దేశవ్యాప్తంగా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల్లో పలు కీలక కార్మిక సంఘాలున్నాయి. అందులో ఆలిండియా డిఫెన్స్‌ ఫెడరేషన్‌కు 55% ఓట్లున్నాయి. ఐఎన్టీసీ, భారతీయ మజ్దూర్‌ యూనియన్లకు కీలక శాతాల్లోనే కార్మిక ఓట్లు ఉన్నాయి. కానీ కేంద్రం ఏనాడూ కార్మిక సంఘాలను సంప్రదించలేదు. అంతర్జాతీయ కార్మిక చట్టాలను సైతం ఉల్లంఘించిందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం పార్లమెంట్‌లో చర్చించకుండా ఏకపక్షంగా బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకొన్నదని విమర్శిస్తున్నారు. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులను కార్పొరేటీకరణ చేయబోమని గతంలో రక్షణ మంత్రులుగా పనిచేసిన నేతలు కార్మికులకు హామీ ఇచ్చారని, వారిలో బీజేపీకే చెందిన మనోహర్‌ పారికర్‌ కూడా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. ఆత్మనిర్భర్‌ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కరోనా సమయంలో 2020 మే 16న అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. కరోనా సమయంలో మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారుచేసి అందించామని.. కానీ భారత ప్రభుత్వానికి కనికరం లేదని వాపోయారు. కేంద్రం నిర్ణయంపై వ్యతిరేకతను తెలిపే హక్కును కూడా కాలరాశారన్నారు. తాము ఎలాంటి సమ్మెలు చేయకుండా ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ యాక్ట్‌-2021(ఈడీఎస్‌ఏ-2021)ను 3 నెలల క్రితం అమలులోకి తెచ్చారని చెప్పారు.

ఇవీ కార్మికుల పోరాటాలు..

ఈడీఎస్‌ఐని తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌. ఓడీఎఫ్‌ల కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఏఐడీఈఎఫ్‌ తరఫున మద్రాస్‌ హైకోర్టులో వ్యాజ్యం.. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతానని కేంద్రం హామీ.. ఈ నెల 25న విచారణ జరుగనున్నది. ఓడీఎఫ్‌లు ప్రభుత్వంలో ఉండాలా. కార్పొరేట్ల చేతికి వెళ్లాలా అని రెఫరెండం పెడితే 99.9% ఉద్యోగులు ప్రభుత్వంలోనే ఉండాలని తీర్పు చెప్పారు.2020 ఆగస్టులో దేశవ్యాప్తంగా 41 ఫ్యాక్టరీలు సమ్మెలు చేశాయి. దిగి వచ్చిన ప్రభుత్వం సంప్రదింపులకు కూడా పిలిచింది. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏఐడీఈఎఫ్‌తోపాటు సివిలియన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కేవీ రావు, బీ శ్రీనివాస్‌, ఆనంద్‌కుమార్‌, సలీముద్దీన్‌, ఎం మల్లేశం, ఎండీ గౌస్‌, బీజేపీ అనుబంధ సంస్థ భారతీయ ప్రతిరక్షక్‌ మజ్దూర్‌ సంఘ్‌ సభ్యులు వరుస ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంఘాల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉద్యోగులకు స్థానిక నేతల మద్దతు

టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గతంలో మెదక్‌ ఓడీఎఫ్‌ వద్ద ధర్నాలకు మంత్రి హరీశ్‌రావు హాజరై మద్దతు తెలిపారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలు తమకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. స్థానిక గ్రామపంచాయతీల్లో, మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌ల్లోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసి కూడా రాష్ట్రపతికి కూడా పంపినట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కేంద్రం వ్యూహాత్మకంగా నేరుగా ప్రైవేటీకరణవైపు కాకుండా డీపీఎస్‌యూ (డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు)గా మారుస్తున్నదని, ఇది క్రమంగా ప్రైవేటీకరణకు దారి తీస్తుందని కార్మిక నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదానీ, అంబానీలకు అమ్మేందుకు ఇది ఒక ముసుగు అని, డీపీఎస్‌యూలుగా మార్చిన తర్వాత వాటిలో షేర్లు జారీచేసి, మెజార్టీ షేర్లు వాళ్లకు కట్టబెట్టడం ద్వారా వారి చేతుల్లోకి వెళ్లేలా చూస్తారని ఆరోపిస్తున్నారు. మొత్తం 41 ఫ్యాక్టరీలను ఏడు యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు 7 నుంచి 10 ఫ్యాక్టరీల చొప్పున కేటాయించి, మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీని ఆర్మమౌర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కిందకు చేర్చారు. ఇది అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

అద్భుతాల నెలవు మెదక్‌ ఓడీఎఫ్‌

నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1984, జూలై 19న మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీలో అత్యద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి. సింగూరు నుంచి నేరుగా వాటర్‌ లైన్‌, శంకర్‌పల్లి నుంచి లోపలికి రైల్వేట్రాక్‌, విశాలరోడ్లు, రామగుండం నుంచి నేరుగా విద్యుత్‌లైన్‌ ఉన్నది. ఇంత అద్భుతమైన సంస్థ కాబట్టే ఇతర ఓడీఎఫ్‌లతోపాటు మెదక్‌ ఓడీఎఫ్‌పైన కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కన్ను పడిందని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేరుగా రాష్ట్రపతి కింద పనిచేస్తున్న తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్లపై పంపేస్తున్నారని, దీంతో మెదక్‌ ఓడీఎఫ్‌లోని 2,800 మందితోపాటు దేశవ్యాప్తంగా 72 వేల మంది కార్మికుల్లో ఆందోళన నెలకొన్నదన్నారు. పాకిస్థాన్‌పై రెండుసార్లు యుద్ధంలో, కార్గిల్‌ యుద్ధంలోనూ మెదక్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ.. ఇతర ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల్లో తయారైన ఆయుధాలే కీలకంగా ఉపయోగపడ్డాయని అప్పటి ప్రధానులు ఇందిర, వాజపేయి పార్లమెంట్‌ సాక్షిగా కితాబిచ్చినట్టు పలువురు కార్మికులు గుర్తు చేస్తున్నారు.