ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Raghu Rama Krishna Raju | ‘జగన్‌’ బెయిల్‌ రద్దు పిటిషన్లు వెనక్కి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పిటిషన్లను హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు. సాంకేతిక కారణాలతో రఘురామ దాఖలు చేసిన పిటిషన్లను తిప్పి పంపారు. అక్రమాస్తుల కేసులో చార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ విచారణ వేగంగా జరిగేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లలో ఎంపీ కోర్టును కోరారు.

ఇంతకు ముందు సైతం నాంపల్లి సీబీఐ కోర్టులోనూ వాదనలు జరిగాయి. మూడు నెలలు పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న జగన్‌, విజయసాయిరెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని రఘురామరాజు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్‌ దాఖలు చేశారని జగన్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టి వేసిన విషయం విధితమే.