ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. రాష్ట్రానికి రిపేర్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తాడేపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు మావేశమయ్యారు. ఈ సందర్భంగా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని పార్టీ శ్రేణులను అభినందించిన ఆయన.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధిక సీట్లు సాధించి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు.
ఏపీ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, సంక్షేమం పేరుతో వైసీపీ సర్కారు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఎవరు మాట్లాడినా, ప్రశ్నించినా అక్రమ కేసులు, బెదిరింపులతో నోరు మూయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు టీడీపీ ఎప్పటికీ భయపడదన్నారు. పాలన అనేదే లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలనే ఎజెండాగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారని.. దేనికి, ఎవరికీ టీడీపీ భయపడదనే విషయం పార్టీ నేతలు, సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు.