తెలంగాణ

యాదాద్రి ఆలయంపై లేటెస్ట్‌ అప్‌డేట్‌.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

అద్భుతమైన శిల్ప సౌరభాలతో పునర్నిర్మించిన యాద్రాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయం త్వరలో ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. భారతీయులందరికీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ దార్శనికతకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో యాదాద్రి ఆలయానికి సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేశారు. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు.. ఒద్దికగా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు.. రాజసంగా కొలువుదీరిన సప్తరాజ గోపురాలు.. గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడుగులు.. ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా, భక్తిభావం ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఆలయం ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో ఆలయ ఉద్ఘాటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆలయ నిర్మాణం.. విశిష్టతను తెలిపేందుకు మంత్రి కేటీఆర్ టిట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో వావ్‌! అనిపించేలా ఉన్నది.