ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుణ బీభత్సం ( Heavy rains ) కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. నదుల్లో పోటెత్తిన వరదల కారణంగా పలుచోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి.
పరిస్థితిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మరోవైపు ఆ రాష్ట్రంలో పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు సీఎంను ఆరా తీస్తున్నారు. కాగా, ఇప్పటివరకు వర్షాలవల్ల చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 22కు చేరినట్లు అధికారులు తెలిపారు.