భారత్‌లో కరోనా వైరస్ రికవరీ రేటు గత ఏడాది మార్చి నుంచి తొలిసారిగా 98 శాతం దాటడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరోవైపు రోజువారీ కొవిడ్-19 కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 116 రోజుల కనిష్టస్ధాయిలో 1.36 శాతానికి పడిపోవడం సానుకూల సంకేతాలు పంపుతోంది.
ఇక తాజాగా దేశవ్యాప్తంగా 231 రోజుల కనిష్టస్ధాయిలో 13,058 పాజిటివ్ కేసులు నమోదవగా వ్యాధి నుంచి 19,470 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 164 మంది ప్రాణాలు విడిచారు. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1.83 లక్షల క్రియాశీల కేసులుండగా వైరస్ బారినుంచి ఇప్పటివరకూ 3.34 కోట్ల మంది కోలుకున్నారు. మహమ్మారితో మొత్తం 4.52 లక్షల మరణాలు నమోదయ్యాయి.