జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడింది. మాకో, కొమురో వివాహ పత్రాన్ని పాలెస్ అధికారులు ఇవాళ ఉదయం సమర్పించినట్లు ఇంపీరియల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ వెల్లడించింది. వివాహానికి సంబంధించి ఎలాంటి విందులు, ఆచారాలు ఉండవని వెల్లడించింది. కాలేజీలో చదువుతున్న సమయంలో కొమురోతో మాకోకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొమురోను వివాహం చేసుకుంటానని 2017లోనే మాకో ప్రకటించింది. ఆర్థిక సమస్యల కారణంగా పెళ్లి వాయిదా పడింది.
డిగ్రీలోనే కొమురోతో మాకో ప్రేమాయణం..
జపాన్ ప్రస్తుత రాజు నరుహిటో సోదరుడు ప్రిన్స్ అఖిషినో కూతురే మాకో. 30 ఏండ్ల మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ నుంచి 2014లో కళలు, సాంస్కృతిక వారసత్వంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ లీసిస్టర్స్ నుంచి మ్యూజియాలజీలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే కొమురో పరిచయం అయ్యారు. తొలిచూపులోనే ఒకరికొకరు నచ్చేయడంతో వారు ప్రేమించుకున్నారు.
రాజభరణాన్ని తిరస్కరించిన మాకో
ఇక ఆ తర్వాత 2017లో తమ ప్రేమ విషయాన్ని మాకో అధికారికంగా ప్రకటించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో మాకో, కొమురోకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఇంపీరియల్ హౌజ్‌హోల్ట్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. 2018, నవంబర్‌లో వీరిద్దరి వివాహం జరుగుతుందని తెలిపింది. అయితే మాకో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆ పెళ్లి కాస్త 2020కు వాయిదా పడి చివరకు ఇప్పుడు వివాహం పూర్తయింది. జపాన్ యువరాణులు సామాన్య కుటుంబానికి చెందిన యువకులను పెళ్లాడితే.. రాచరికపు హోదాను మాత్రమే కాకుండా, సంప్రదాయం ప్రకారం రాచ కుటుంబం నుంచి బహుమతిగా వచ్చే సుమారు రూ. 9 కోట్లను మాకో తిరస్కరించింది.