అంతర్జాతీయం ముఖ్యాంశాలు

టీకా పొందని సిబ్బందిని సస్పెండ్‌ చేసిన ఎయిర్‌ కెనడా

కరోనా టీకా తీసుకోని సుమారు 800 మందికిపైగా సిబ్బందిని ఎయిర్‌ కెనడా సస్పెండ్ చేసింది. కరోనా కొత్త నిబంధనల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు గ్లోబల్‌ న్యూస్‌ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో కరోనా నియంత్రణకు గత నెలలో ఒక ఉత్తర్వు జారీ చేశారు. అక్టోబర్ 30 నాటికి తమ కార్మికులకు టీకా విధానాలను ఏర్పాటు చేయాలని ఎయిర్, రైలు, షిప్పింగ్ కంపెనీలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కోసం పలు చర్యలు చేపట్టాయి.

కాగా, ఎయిర్‌ కెనడాకు చెందిన 27,000 మంది కేబిన్‌ క్రూ, కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్లు, ఇతర సిబ్బంది టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ రస్సో తెలిపారు. 96 శాతం మందికిపైగా సిబ్బంది పూర్తిగా టీకాలు పొందారని చెప్పారు. అయితే టీకాలు తీసుకోని, వైద్య లేదా ఇతర మినహాయింపు అనుమతి లేని ఉద్యోగులను వేతనం లేని సెలవులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.