సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ తన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఎఫ్‌బీ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని చెప్పింది. తమ వద్ద ఉన్న వంద కోట్ల మంది యూజర్ల ఫేషియల్ డేటాను డిలీట్ చేస్తున్నట్లు కూడా ఫేస్‌బుక్ వెల్లడించింది. ఫేస్ స్కాన్ డేటాను పూర్తిగా డిలీట్ చేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. సామాజిక ఆందోళనలు, రెగ్యులేటరీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌బీ వెల్లడించింది. ఫేస్‌బుక్ యాప్‌లో ఉండే యాక్టివ్ యూజర్లలో మూడవ వంతు మంది ఫేస్ రికగ్నిషన్ సెట్టింగ్స్‌ను వాడుతున్నారు. ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీపై సమాజంలో చాలా వరకు కలవరం నెలకొన్నదని, ఆ ఆప్షన్ విషయంలో ప్రభుత్వం కూడా క్లియర్ రూల్స్‌ను రూపొందించలేకపోతున్నట్లు ఎఫ్‌బీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తెలిపారు.
కొత్త టెక్నాలజీపై అనిశ్చితి నెలకొన్న దృష్ట్యా.. ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తగ్గిస్తున్నట్లు ఎఫ్‌బీ వెల్లడించింది. అంధులు, చూపు లేని వారి ఫేస్ డేటాను కూడా నిర్వీర్యం చేస్తున్నట్లు ఎఫ్‌బీ వెల్లడించింది. మనం గుర్తుపట్టలేని వ్యక్తులను కూడా గుర్తించే విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని రూపొందించారు. దీంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీతో వేధింపులకు దిగే అవకాశాలు ఉన్నట్లు కొందరు అభిప్రాయపడ్డారు.
ఫేస్‌బుక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవసీ అండ్ సివిల్ రైట్స్ గ్రూపులు ఆహ్వానించాయి. ప్రమాదకరంగా మారిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగాన్ని నిలువరించడం మంచి పరిణామం అని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఓ ట్వీట్‌లో తెలిపింది.