పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు తాకుతుండటం పట్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీపావళి పండుగకు ముందు ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకిందని ఆయన ట్వీట్ చేశారు. దీపావళికి ధరలు మోతెక్కుతున్నాయని..మోదీ ప్రభుత్వం ప్రజలను కనికరించాలని రాహుల్ పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యధిక పన్నులు రాబడుతూ మోదీ సర్కార్ ప్రజలను దోచుకుంటోందని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ 120 దాటాయనే వార్తల క్లిప్పింగ్స్‌ను రాహుల్ తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు. పన్ను బాదుడును ప్రస్తావిస్తూ జేబుదొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాహుల్ ఇటీవల చేసిన ట్వీట్‌లో మోదీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.