China Village in Arunachal | ఇటీవలి కాలంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్ఏసీ) ఈవలకు వచ్చి చైనా.. అరుణాచల్‌ప్రదేశ్ పరిధిలో 100 ఇండ్లను చైనా నిర్మించింది. అమెరికా కాంగ్రెస్‌కు చైనా రక్షణశాఖ సమర్పించిన నివేదికలో వెల్లడించింది. మైక్ మెహన్ లేఖకు దక్షిణాన భారత సరిహద్దుల్లో ఈ గ్రామం నిర్మించారని బయటపడింది. అరుణచల్‌ప్రదేశ్‌లో మన భూభాగంలో చైనా ఒక గ్రామాన్నే నిర్మించిన విషయమై ఉపగ్రహ చాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ చానెల్ ఈ ఏడాది ప్రారంభంలో ఓ వార్తాకథనం ప్రచురించింది.
టిబెట్ అటానమస్ రీజియన్, భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్ మధ్య ఈ గ్రామాన్ని పీపుల్స్ రిపబ్లిక్ చైనా (పీఆర్సీ).. 2020 మధ్యలో ఎప్పుడో నిర్మించి ఉంటుందని అమెరికా రక్షణశాఖ నివేదిక సారాంశం. చైనా-భారత్ సరిహద్దుల పొడవునా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే ఈ గ్రామాన్ని డ్రాగన్ నిర్మించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని భారత్, దేశీయ మీడియా వర్గాలు అంటున్నాయి.
అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డునే ఈ గ్రామం నిర్మాణం చేపట్టడం సందేహస్పదంగా మారింది. ఈ ప్రాంతంలో 1962కు ముందు కూడా రెండు దేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఒకవైపు దౌత్యపరంగా, సైనిక పరంగా చర్చలు జరుపుతూ మిలిటరీ ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నం జరుగుతున్నా.. ఈ ప్రాంతం ఎల్ఏసీ పరిధిలోకే వస్తుందని డ్రాగన్ వాదిస్తున్నది.