Malala Yousafzai on Marriage | బాలికల విద్య కోసం 15 ఏండ్ల వయస్సులోనే పోరాడి తాలిబన్లను ఎదిరించిన పాక్ హక్కుల కార్యకర్త మలాలా తానెప్పుడూ వివాహ బంధానికి వ్యతిరేకం కాదని చెప్పారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి అసర్ మాలిక్‌ను ఇటీవలే ఆమె పెండ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తన పెండ్లి వేడుక ఫొటోలను షేర్ చేస్తూ వైవాహిక జీవితంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పెండ్లికి వ్యతిరేకం కాదన్నారు.
పితృస్వామ్య వ్యవస్థ.. మహిళలపై ద్వేషం వల్లే..
పితృస్వామ్య వ్యవస్థతోపాటు కొందరిలో మహిళల పట్ల ద్వేషం వల్లే వివాహంపై ఆందోళన వ్యక్తం చేశానని మలాలా చెప్పారు. బాల్య వివాహాలతోపాటు పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఎలా రాజీ పడుతున్నారన్న అంశాలపై వచ్చిన నివేదికలు.. తాను జాగ్రత్తగా ఉండేలా చేశాయని అన్నారు. అందుకే ఈ వ్యవస్థను ప్రశ్నించాలంటూ వ్యాఖ్యానించారు. తన విలువలను అర్థం చేసుకునే వ్యక్తి భర్తగా దొరికినందుకు అదృష్టవంతురాలినని తన భర్త అసర్ మాలిక్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.
ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మలాలా ఇలా
ఈ ఏడాది జూన్‌లో ఓ మ్యాగజైన్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ.. ప్రజలు పెండ్లెందుకు చేసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. ఒక వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకున్నప్పుడు వివాహ పత్రాలపై ఎందుకు సంతకాలు చేయాలి.. అది భాగస్వామ్య ఒప్పందంగా ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సరిగ్గా ఐదు నెలల్లోనే పెండ్లి చేసుకోవడంతో మలాలా తీరుపై నెటిజన్లు నాటి ఆమె వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్పందిస్తున్నారు.
బాలికల హక్కుల కోసం ఇలా పోరాటం..
పాకిస్థాన్‌లోని స్వాత్‌లోయకు చెందిన మలాలా.. బాలికలకు విద్య కోసం తాలిబన్లను ఎదిరించారు. దీంతో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో గాయపడిన మలాలాను తొలుత పెషావర్‌కు.. తదుపరి బ్రిటన్‌కు తరలించి చికిత్స అందించారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఆమె మహిళలు, బాలికల హక్కుల కోసం పోరాడారు. బాలికల హక్కుల కోసం ఆమె పోరాటానికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.