చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బీజింగ్‌లో కేసులు ఎక్కువగా ఉండటంతో.. కొన్ని ఏరియాల్లో బీజింగ్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బీజింగ్ నుంచి వచ్చేవారిని తమ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు.
చైనా మెయిన్ లాండ్‌లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు మొత్తం 1,308 మందిలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదిలావుంటే గత వేసవిలో డెల్టా వేరియంట్ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,280 డెల్టా రకం కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని 21 ప్రావిన్స్‌లు, రీజియన్‌లు, మున్సిపాలిటీల్లో డెల్టా వేరియంట్ ప్రభావం ఉన్నది. ఇతర దేశాల్లో కంటే చైనాలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వ జీరో టోలరెన్స్ మార్గదర్శకాల మేరకు వైరస్ సంక్రమణను సాధ్యమైనంత త్వరగా నిలిపివేసే చర్యలు చేపడుతున్నది.