ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో ఏండ్లుగా వంశ పాలన కొనసాగిందని, కుటుంబపాలనల్లో యూపీ ప్రజల ఆకాంక్షలు అణిచివేతకు గురయ్యాయని ఆయన విమర్శించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం సుల్తాన్ పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఏండ్లుగా ఉత్తమాటలు చెప్పే ప్రభుత్వాలను చూశాం. గత ప్రభుత్వాలు రోడ్ కనెక్టివిటీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు పారిశ్రామిక ప్రగతి గురించి కల్లబొల్లి మాటలు చెప్పాయి. దాంతో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడి ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గత ప్రభుత్వాలు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ విద్యుత్ కోతలు ఉండేవి. శాంతిభద్రతల పరిస్థితి సరిగా ఉండేది కాదు. అంతేగాక గత ముఖ్యమంత్రులు తమ ఇండ్లు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే అభివృద్ధి చేసేవారు అని ప్రధాని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి అనేది అంతటా ఒకేలా జరుగాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగడం, మరికొన్ని ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుకబడిపోవడం ఏ దేశానికైనా మంచిది కాదన్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వం ఉన్నదని, ఈ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ హయాంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని అన్నారు. కొంతమంది తాము చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక అసహనం వ్యక్తం చేస్తున్నారని, అది సహజమేనని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యూపీలో గత సర్కారు తనకు సహకరించలేదని, తనతో కలిసి నిలబడితే వాళ్ల ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే భయం వారిలో కనిపించేదని ఆయన ఎద్దేవా చేశారు.