మైసూర్ టైగర్ టిప్పు సుల్తాన్ వాడిన సింహాసనం గురించి అప్పట్లో గొప్పలు చెప్పుకునేవారు. ఆ సింహాసనాన్ని వజ్రాలు, వైడూర్యాలు పొదిగించి బంగారం తొడుగుతో నిర్మించారు. దానికి ఎనిమిది పులుల తలలు ఉంటాయి. అయితే.. టిప్పు సుల్తాన్ ఓటమి తర్వాత బ్రిటీష్ ఆర్మీ దాన్ని ముక్కలు చేసింది. సింహాసనాన్ని తస్కరించింది. ఆ సింహాసనంలో ఉన్న 8 బంగారు పులుల తలల్లో ఇది చివరిది. దాన్ని ప్రస్తుతం ఇంగ్లండ్.. వేలంలో పెట్టింది. దాని ధరను 1.5 మిలియన్ పౌండ్లుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 15 కోట్ల రూపాయలు.
Throne Finial పేరుతో టిప్పు సింహాసనాన్ని ఇంగ్లండ్ వేలం వేయగా.. దాన్ని వేలంలో వచ్చే సంవత్సరం జూన్ వరకు ఉంచనున్నారు. దాన్ని ఎగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా తాత్కాలికంగా దాన్ని బ్యాన్ చేస్తున్నట్టు యూకే వెల్లడించింది.
ఆ సింహాసనం.. యూకే దాటి వెళ్ల ప్రమాదం ఉంది.. అందుకే దానిపై తాత్కాలికంగా ఎగుమతిపై బ్యాన్ విధించాం. దాన్ని యూకేకు చెందిన వాళ్లే దక్కించుకుంటారని ఆశిస్తున్నాం.. అని యూకేకు చెందిన డిజిటల్, కల్చర్, మీడియా డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది.
ట్విట్టర్‌లో భగ్గుమన్న భారత నెటిజన్లు
యూకే డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసిందో లేదో.. భారత నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇండియా నుంచి దొంగలించిన టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని ఎలా వేలం వేస్తారు.. చోర్.. అంటూ ఇంగ్లండ్‌పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఇండియన్స్ ఎవరూ కొనకుండా.. దానిపై ఎక్స్‌పోర్ట్ బ్యాన్ విధించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
టిప్పు సుల్తాన్‌ను ఓడించిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీ.. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని ఎత్తుకెళ్లిందంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
ఇండియా సొత్తును దొంగలించి.. తిరిగి ఇండియాకు ఇచ్చేయకుండా.. వేలం వేయడం ఏంటి.. వెంటనే దాన్ని ఇండియాకు తిరిగి ఇచ్చేయాలి అంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు.
యూకే సిగ్గుపడాల్సిన సందర్భం. ఇండియా నుంచి దొంగలించి తీసుకెళ్లిన వస్తువులను అమ్ముకొని బతుకుతున్నారు. వెంటనే ఇండియా నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులను రిటర్న్ చేయాలి.. అంటూ మరో యూజర్ ఫైర్ అయ్యారు.