జాతీయం ముఖ్యాంశాలు

సోనియా నివాసంలో ఇవాళ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

 కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా నివాసంలో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ద్రవ్యోల్బణం సమస్యను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు చెప్పారు.

అలాగే కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లోనే కాకుండా బహిరంగ వేదికల్లో కూడా ‘కరోనా మేనేజ్‌మెంట్‌’ అంశంపై లేవనెత్తాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కరోనా బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర లేఖ రాయనున్నారు. ప్రతి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్‌పీ) నేతలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయనున్నారు.

బుధవారం మహారాష్ట్ర సీఎల్పీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) నిబంధనల ప్రకారం కరోనా మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని లేఖలో సీఎల్పీ కోరింది. మృతుల బంధువులకు రూ.3లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.4 లక్షల్లో 75 శాతం కేంద్రం చెల్లించాల్సి ఉండగా, మిగిలిన 25 శాతం రాష్ట్రానిదేనని సీఎల్పీ నేత తెలిపారు.