తెలంగాణ

అనాథలకు ప్రభుత్వమే అమ్మానాన్న

  • అన్నీతానై చూసుకొంటున్న రాష్ట్ర సర్కారు
  • 300 బాలసదనాల్లో పిల్లలకు నైపుణ్య శిక్షణ
  • జిల్లాకో బాలరక్షక్‌ వాహనం కేటాయింపు

అనాథల భవిష్యత్తుకు రాష్ట్ర సర్కారు బలమైన పునాది వేస్తున్నది. పిల్లలను అక్కున చేర్చుకొని వారికి అన్నీతానే అవుతున్నది. విద్యాబుద్ధులు నేర్పించి, తమ కాళ్ల మీద తాము నిలబడేదాకా తల్లి, తండ్రిలా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లోని అనాథ పిల్లలకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నది. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీయటం కోసం నెలకు రెండు రోజులు వేదిక్‌ మ్యాథ్స్‌, అడ్వాన్స్‌ ఇంగ్లిష్‌, యోగా, వ్యక్తిత్వవికాసం, వ్యాసరచన, వకృత్వం, డ్రాయింగ్‌, కళలు, సంస్కృతులపై అవగాహన కల్పిస్తున్నది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణ రంగారెడ్డి జిల్లాతో మొదలైంది. త్వరలో అన్ని జిల్లాలకు విస్తరించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల బాలరక్షక్‌ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. పిల్లలకు ఆపద వస్తే అత్యవసర వినియోగానికి జిల్లాకో వాహనాన్ని కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని శిశువిహార్‌, బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కాగా, రాష్ట్రంలో అనాథపిల్లల కోసం సీఎం కేసీఆర్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన విషయం తెలిసిందే.

అత్యాధునిక హంగులతో నిలోఫర్‌లో శిశువిహార్‌ వార్డు

అనాథపిల్లల ఆరోగ్యానికి సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిలోఫర్‌ దవాఖానలో అత్యాధునిక హంగులతో, కార్పొరేట్‌ స్థాయిలో ‘శిశువిహార్‌ వార్డు’ను ఏర్పాటు చేసింది. ఆహ్లాద వాతావరణాన్ని తలపించేలా దీన్ని రూపొందించారు. పిల్లలకు అందించే ఆహారం, వారి యోగక్షేమాలను చూసుకొనేందుకు ఆయాలను నియమించారు. 10 బెడ్స్‌తో ఉండే ఈ ప్రత్యేకవార్డుతోపాటు, ఒక ఐసీయూ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.