- అభ్యర్థుల ఎన్నిక ఇక లాంఛనమే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా శనివా రం ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరిన ఆమెకు మోర్తాడ్‌లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఆ తరువాత ఆమె మెట్‌పల్లి పట్టణంలో కొద్దిసేపు ఆగారు. అక్కడ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉన్నదని కవిత తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేస్తుందని, నిధులు, విధులతోపాటు ప్రజాప్రతినిధులకు గౌరవం నిలబెట్టే విధంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారి దయతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భానుప్రసాద్‌రావు గెలుపు తథ్యమన్నారు. స్థానిక సంస్థల్లో 80 శాతానికిపైగా ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నారని ఆమె తెలిపారు.
కొండగట్టులో ప్రత్యేక పూజలు
ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు. భక్తులు రామకోటి రాసుకునేందుకు వీలుగా ఆలయ ఆవరణలో రామకోటి స్తూపాన్ని నిర్మిస్తున్నామని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్టు చెప్పారు. ఇక్కడ కవిత వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఉన్నారు.